అసోంలో సీఎం హిమంత బిశ్వ శర్మ ఘన విజయం
- అసోంలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ
- 89 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందిన హిమంత
- అక్రమ చొరబాటుదారుల విషయంలో కఠినంగా వ్యవహరించిన హిమంత
అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేసింది. తన సొంత నియోజకవర్గమైన జలుక్బరి నుంచి హిమంత ఏకంగా 89,434 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థులను చిత్తు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి బిదిష నియోగ్‌కు కేవలం 37,717 ఓట్లు మాత్రమే రావడంతో హిమంత వ్యక్తిగత క్రేజ్ ఏంటో మరోసారి స్పష్టమైంది. హిమంతకు 1,27,151 ఓట్లు వచ్చాయి.
బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారుల విషయంలో హిమంత అనుసరించిన కఠిన వైఖరి ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఆదివాసీ భూములను చొరబాటుదారుల నుండి విముక్తి కల్పించడం ఆయనకు అన్ని వర్గాల మద్దతు తెచ్చిపెట్టింది. చికెన్‌నెక్ కారిడార్‌పై బంగ్లాదేశ్ ప్రకటనలను సమర్థవంతంగా తిప్పికొట్టడం, వరద నివారణ చర్యలు చేపట్టడం వంటి అంశాలు ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేశాయి. ఎన్ఆర్సీ అమలు, చొరబాట్లకు శాశ్వత అడ్డుకట్ట వేస్తామన్న బీజేపీ హామీ ఓటర్లలో నమ్మకాన్ని కలిగించింది.